||సుందరకాండ. ||

||తత్త్వదీపిక- ముప్పది ఎనిమిదవ సర్గ ||

||"ఇదం శ్రేష్ఠం అభిజ్ఞానం"!||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ అష్టత్రింశస్సర్గః

తత్త్వదీపిక
ముప్పది ఎనిమిదవ సర్గ
"ఇదం శ్రేష్ఠం అభిజ్ఞానం"

"తత్ తస్య సదృశం" అంటే అలా చేయడము ఆయనకు తగును అన్న సీత మాటకి ,
హనుమంతుడు " తత్ తే సదృశం",
అంటే ఆ మాట నీకే తగును అంటూ
సీతమాటకి వేనోళ్ల పొగుడుతాడు.
అది ఈ సర్గలో వింటాము

ముప్పది ఏడవ సర్గలో రాముడు వచ్చి రావణ సంహారం చేసి
తనను తీసుకుపోవుట యే రామునకు యుక్తము అంటూ,
తనని తన పృష్టముపై ఎక్కించుకొని
రామునితో తక్షణమే సీతా సమాగము చేయగలనని చెప్పిన హనుమంతుని మాటని,
తగిన కారణాలతో నిరాకరించింది సీత.

ఆ చివరిమాటగా హనుమంతుడి తో ఇలా అంటుంది.
' ఓ హనుమా రాముని లంకకు వచ్చునట్లు చేసి,
"కురుష్వ మాం వానరముఖ్య హర్షితాం" -
ఓ వానర ముఖ్యుడా నన్ను సంతోషము కలదానినిగా చేయుము", అని.

తన మాటలని కాదనినా,
సీత చెప్పిన కారణాలు యుక్తమే అని గ్రహించిన హనుమ మళ్ళీ సీత తో ఇలా మాట్లాడతాడు.

'ఓ మంగళశ్వరూపీ అయిన సీతా !
నీవు చెప్పిన మాటలు యుక్తము.
అవి స్త్రీరూపమునకు స్వభావమునకు సాధ్వి యొక్క నమ్రతకు అనుగుణముగా ఉన్నాయి.
నాపై ఎక్కి నూరు యోజనముల విస్తీర్ణము కల సాగరము దాటుట సహజముగా స్త్రీలకు కాని పని.
వినయముతో మూర్తీభవించిన ఓ జానకీ !
నీవు చెప్పిన రెండవకారణము రాముని కాక ఇతరపురుషుని తాకను అన్నది.
అది మహాత్ముడైన పత్నికే సదృశము.
నీవు తప్ప ఇంకెవరూ ఇటువంటి మాటలు చెప్పరు.
కాకుత్‍స్థుడు ఇక్కడ జరిగినది అంతా నాముందు జరిగిన భాషణ శేషము లేకుండా వినును".

సీత హనుమంతుడు రాక్షసుల నందరినీ చంపి వేయడానికి సమర్థుడైనా అలాచేస్తే
"రాఘవస్య యశో హీయేత్'
అంటే రాఘవుని యశస్సుకు భంగము అని,
రాముడు వచ్చి రావణసంహారము చేసి తనని తీసుకు పోవుట యుక్తము అని చెప్పి,
తరువాత హనుమంతుడి పృష్టము మీద కూర్చుని పోవడములో
తన పాతివ్రత్యము భంగము అవుతుంది అన్నమాట కూడా చెపుతుంది.
దానికి సమాధానముగా హనుమంతుడు
' తల్లీ నీవు చెప్పిన మాట నీకే తగును.
ఇంకెవరూ ఇలా చెప్పలేరు' అని సీత మాటతో సమ్మతిస్తాడు.

అప్పుడు హనుమ సీతను రాఘవుడు గుర్తింపగల అభిజ్ఞానమును ఇవ్వమని కోరుతాడు.

ఈ విధముగా హనుమంతునిచే ప్రేరేపింపబడిన సీత,
కన్నీళ్ళతో తడబడిన మాటలతో మందస్వరముతో
"ఇదం శ్రేష్ఠం అభిజ్ఞానం" అంటూ ఈ విధముగా పలికెను.
" నీకు ఈ శ్రేష్ఠమైన నా ప్రియునకు తెలిసిన అభిజ్ఞానము చెప్పెదెను.
ఈ కథను నేను చెప్పినట్లు రామునితో చెప్పుము'అని.

'చిత్రకూట పర్వతముయొక్క ఈశాన్యభాగములో,
జలమూలఫలములు సమ్మృద్ధిగా వున్న పర్వతపాదప్రాంతములో,
సిద్ధాశ్రమములు కలప్రదేశములో,
మందాకినీ నదికి దగ్గరలో తాపసాశ్రమ వాసుల వలె ఉండెడివారము'.

'అక్కడి పుష్పపరిమళాలతో నిండిన ఉపవనములలో విహరించి నీ వడిలో పడుకొనినదానను.
అప్పుడు ఒక వాయసము మాంసపు ముక్కని మాటిమాటికి తన ముక్కుతో పొడుస్తూ ఉండెను.
నేను ఒక మట్టిబెడ్డతో దానిని వారించుతున్నదానను.
ఆ కాకి నా చుట్టు తిరుగుతూ నన్ను పొడుచుటకు ప్రయత్నము చేసెను.
తినుటకు కోరికగల ఆ కాకి మాంసఖండమును వదలలేదు.
నేను ఆ పక్షిపై కోపముతో వున్న జారిన పమిటను సరిచేసుకొనుచున్ననన్ను నీవు చూచితివి'.

"అలా కోపములో ఉన్న నన్నుచూసి నవ్వితివి.
సిగ్గుపడి , తినాలనే కోరికగల కాకిచేత గీకబడి నేను నీ ఆశ్రయమునకు చేరితిని.
శాంతముగా ఉపాసీనుడవైన నీ వడిలో మరల ప్రవేశించితిని.
క్రోధముతో ఉన్న నన్ను నవ్వుతూ ఊరడించితివి.
ఓ నాధ ! వాయసముచేత ప్రకోపింపబడిన భాష్పములతో నిండిన ముఖము కల నాక్రోధమును నీవు చూచితివి'.

' నేను కూడా ఆ శ్రమతో రాఘవుని అంగములలో చాలాసేపు నిద్రపోయితిని.
మరల భరతాగ్రజుడు నా అంగములలో నిద్రపోయెను.
అప్పుడు ఆ వాయసము మరల అచటికే వచ్చెను.
అప్పుడు ఆ వాయసము వెంటనే వచ్చి
రాముని అంగములనుంచి లేచిన నా స్తనముల మధ్య తన ముక్కుతో పొడిచెను.
అది మళ్ళీ ఎగిరి మళ్ళీ పొడిచెను'.

'అప్పుడు రాముడు తన మీదపడుచున్న రక్త బిందువులతో తడిసెను.
అప్పుడు ఆ వాయసముచేత బలవత్తరముగా బధింపబడుతున్న నాచేత,
సుఖముగా నిద్రలో నున్న శ్రీమంతుడు లేపబడెను .
అప్పుడు స్తనములపై గాయపరచబడిన నన్నుచూచి
కోపముతో విషముక్రక్కుచున్న పాము వలె బుసలు కొట్టుతూ నీవు ఇట్లు పలికితివి".

'సీతా నీ స్తనముల మధ్య లో గాయము చేస్తున్న వాడెవడు.
కోపించిన ఐదుతలలు గల పాముతో ఎవడు ఆడగోరుచున్నాడు?
అలా చూస్తూ వున్న తీక్షణమైన గోళ్లతో నాకు ఎదురుగా నిలబడి వున్న ఆ వాయసమును చూచితివి.
ఎగురువానిలో శ్రేష్ఠుడు అగు ఆ వాయసము ఇంద్రుని పుత్రుడు.
శీఘ్రముగా భూమిపై దిగి వచ్చిన వాడు.
గతిలో వాయుసమానుడు'.

అప్పుడు ఆ వాయసముపై కోపము కలిగిన రాముడు,
కూర్చుని ఉన్న దర్భాసనమునుండి ఒక దర్భను తీసికొని బ్రహ్మ అస్త్రముగా ప్రయోగించెను.
ఆ అస్త్రము కాలాగ్నివలె మండుచూ ఆ వాయసమునకు అభిముఖమై ప్రజ్వరిల్లసాగెను.
ఆ మండుచున్న ఆ దర్భ ఆ వాయసమును ఆకాశములో అనుసరించసాగెను.
ఆ వాయసము ముల్లోకములను తిరిగి
తండ్రి అలాగే మహర్షులచేత తిరస్కరింపబడిన వాడై రామునే శరణు కోరెను.
శరణాగతుడై భూమిపై పడివున్న ఆ వాయసమును వధార్హుడైనప్పటికీ రాముడు దయతో కాపాడెను.'

'అలా శరణాగుతు డై వచ్చిన ఆ వాయసముతో రాముడు ఇట్లు పలికెను.
' ప్రయోగింపబడిన బ్రహ్మ అస్త్రమును నిరర్ధకము చేయుట శక్యము కాదు.
ఏమి చేయవలనో చెప్పుము' అని.
అప్పుడు ఆ వాయసము చెప్పెను. " నీ శరము నా కుడికన్నును నిరర్ధకము చేయుగాక' అని.
అప్పుడు ఆ వాయసముయొక్క కుడికన్ను నిరర్ధకము చేయబడినది.
ఆ వాయసము అలా తన కుడి కన్ను ఇచ్చి తన ప్రాణములను రక్షించుకొనెను.
పిమ్మట ఆ వాయసము రామునకు నమస్కరించి దశరథునకు నమస్కరించి
ఆ వీరుని ఆజ్ఞతో తన నివాసమునకు తరలి పోయెను.

ఇది సీతమ్మ చెపుతున్న అభిజ్ఞానము.

ఈ అభిజ్ఞానములో కూడా సీత సందేశము ఉంది.
అది 'ఓ రామా ఆ వాయసము లాగా నేను కూడా రక్షింప తగినదానిని కదా' అని.
అదే సీత మళ్ళీ రాముడికి తన మాటగా చెపుతుంది

' ఓ రాజా ! నన్ను బాధించిన ఆ వాయసముపై బ్రహ్మాస్త్రము ప్రయోగించిన నీవు,
నన్ను అపహరించిన వానిని ఎందుకు క్షమిస్తున్నావు?
ఓ నరర్షభ ! మహోత్సాహముతో నాపై దయచూపుము.
ఓ నాధా ! నాధకల నేను, అనాధవలె నున్నాను'.

' ఇతరుల శోకమును శమింపచేయుట ధర్మము అని నీ దగ్గరనుంచే నాచేత వినబడినది.
నీవు మహావీరుడవు మహోత్సాహము కల మహాబలుడవు.
అసాధ్యమైన వాటిని సాధ్యము చేయువాడవు.
సముద్రము వలె గంభీరుడవు.
ధరణికి భర్తవు.
ఇంద్రుని తో సమానుడవు అని నాకు తెలుసు '.

' ఓ రాఘవా అస్త్రములు ప్రయోగించువారిలో శ్రేష్ఠుడవు బలవంతుడవు అయిన నీవు
ఈ రాక్షసులపై ఎందుకు అస్త్రములను ప్రయోగించవు?
సమరములో రాముని ధాటికి నిలబడుటకు
నాగులు గంధర్వులు సురులు మరుద్గణములు కూడా సమర్థులు కారు.
ఆ వీరుడైన రామునకు నాపై కించిత్తు దయవున్నా
తీక్షణమైన బాణములతో రాక్షసులను ఎందుకు నాశనము చేయుటలేదు?'

'పరంతపుడు మహాబలుడు వీరుడు అయిన లక్ష్మణుడు
అన్నగారి ఆదేశముతో ఎందుకు నన్ను రక్షించుట లేదు?.
వాయువు అగ్నితో సమానమైన తేజస్సుగల పురుషవ్యాఘ్రము లగు వారిని
సురులు కూడా ఎదురుకొనలేరు.
అట్టి వారు నన్ను ఎందుకు ఉపేక్షించుచున్నారు?
నాలో ఎదో మహత్తరమైన పాపము ఉన్నది.
దానిలో సంశయము లేదు.
సమర్ధులైనాగాని ఆ పరంతపులు నన్ను ఉపేక్షించుచున్నారు'.

సీత తను "అల్ప పుణ్యా" అని ,
" కీదృశం పాపం పురా జన్మాంతరే కృతం" అని,
ఇంతకు ముందుకూడా తనను తాను నిందించుకున్నది.
ఇక్కడ హనుమంతునితో సంభాషణలో అదే మాట చెపుతుంది.
చివరి మాటలో "ఎదో మహత్తరమైన పాపము నాదే" అనడములో ఇంకో ధ్వని వినిపిస్తుంది.

భగవంతుడే ఉపాయమని విశ్వశించియున్న భక్తులు,
వారు తమకు కష్టములు ఏవైనా వచ్చినప్పుడు భగవంతుని దూషించుట, దెప్పుట చేయరు.
ఆ కష్టములు వచ్చుటకు తాము చేసిన పాపమే కారణమనియు,
భగవంతుడు ఆకర్మను అనుభవింపచేసి తనను చేర్చుకొనుటకే అనుగ్రహించుచున్నాడని తలుస్తారు.
అలాగే సీతకూడా తాను అనుభవించుచున్న కష్టాలకి తన పాపమే కారణమని అనుకుంటుంది.

ఆ పాపముల గురించి మాట్లాడుతూ సీత
"కించి మహత్ అస్తి" అంటే ఏదో పెద్దపాపమే చేశాను అనుకుంటుంది.
అదే "కొద్దియో గొప్పయో నాపాపమే కారణము" అన్నమాటలో పాపములను గురించి విశదీకరిస్తూ అప్పలాచార్యులవారు ఇలా చెపుతారు.
భగవదపచారము కొద్ది పాపము.
భాగవతాపచారము పెద్దపాపము.
భగవంతుని విషయములో చేసే తప్పు కన్న,
భగవంతుని భక్తులవిషయములో చేసే తప్పు పెద్ద అపచారము.

తండ్రిమాట నిలబెట్టుటకు వనవాసము పోబోతున్న రామునితో,
సీత తను వనవాసమునకు వస్తాను అని బ్రతిమాలి చివరికి ఇలా అంటుంది -
" భార్యను అరణ్యమునకు తీసుకు వేళ్ళలేదని మా తండ్రి అగు జనకుడు విన్నచో,
స్త్రీయే పురుషవేషమున వచ్చి తన కుమార్తెను వివాహమాడెను అని తలంచును"
ఇలా ఆక్షేపణలో సీత చేసినది అపచారమే.
ఇది భగవదపచారము.
పాపము.

మాయామృగమును చంపుటకు రాముడు వెళ్ళి మారీచుని చంపగా ,
మారీచుడు " హా సీతా హా లక్ష్మణా" అని కేకవేసి చనిపోయెను.
అప్పుడు సీత రాముని రక్షించుటకు వెళ్ళమని లక్ష్మణునితో చాలా పరుషముగా మాట్లాడును.
అది భగవద్భక్తుడగు లక్ష్మణుని విషయములో చేసిన అపచారము.
అది భాగవదపచారము.
మహాపచారము.
ఈ రెండింటినీ అనుభవించుచున్నానని సీత గుర్తించెను.
ఈ రెండిటి ఫలమే బంధము.

వైదేహి యొక్క ఆ కన్నీరుతో పలికిన వచనములను వినిన
మహా తేజము కల ఆ హనుమంతుడు ఇట్లు పలికెను.

' ఓ దేవి నీ వియోగ శోకముతో రాముడు విషయములలో విముఖత చూపించుచున్నాడు.
సత్యముగా ప్రమాణము చేసి చెప్పుచున్నాను.
రాముడు దుఃఖములో నుండుటవలన లక్ష్మణుడు కూడా దుఃఖములో ఉన్నాడు.
ఎలాగో అదృష్టము కొలదీ నీవు చూడబడినావు.
ఇది విచారించవలసిన కాలము కాదు.
ఓ పూజ్యురాలా ! ఈ క్షణమే దుఃఖముల అంతము చూస్తున్నావు.
ఆ మహాబలవంతులూ పురుషవ్యాఘ్రములు అగు రాజపుత్రులు ఇద్దరూ
నీ దర్శనము నకై ఉత్సాహముతో ఈ లంకానగరమును భస్మము చేసెదరు.
ఓ విశాలాక్షీ రాఘవుడు రావణుని అతని బంధువులతో సహా హతమార్చి
నిన్ను తన పురమునకు తీసుకుపోవును'.

' రాఘవునకు, మహాబలుడు లక్ష్మణునకు, తేజస్వి సుగ్రీవునకు
అక్కడ సమాగమైన వానరులకు ఏమి మాటలు చెప్పవలెనో అవి నీవు చెప్పుము'.
ఈ విధముగా అడగబడిన ఆ సీత, మారుతాత్మజుడగు హనుమంతునితో ఇట్లు పలికెను.

'లోకము సంరక్షించుటకు మనస్విని అయిన కౌసల్య ఎవరికి జన్మమిచ్చెనో
వానికి నాకొఱకు శిరస్సు వంచి అభివాదము చేసి వారి కుశలము అడుగుము'.

ఇక్కడ రాముని నమస్కరించి కుశలములు అడగమని చెపుతూ సీత,
రాముడు లోకము సంరక్షించుటకు కౌసల్యాదేవికి పుట్టినవాడు అని అన్నప్పుడు,
మనము వినే ధ్వని, 'ఓ లోకసంరక్షకా నీకు నమస్కరిస్తున్నాను నన్నుకూడా రక్షించు' అని.
ఆ కుశలములు అడగడము నమస్కారములలోనే ఇమిడి యుంది సీతమ్మ ఆత్మ రక్షణ ఘోష.

భగవంతుడు ఉన్నాడు అని నమ్మి,
'నేను నావాడను కాను , నీ వాడను అని వంగి నమస్కరిస్తే' చాలును.
భగవంతుడే ఆ భవసాగరమును దాటించును.
ఇక్కడ సీతమ్మ చేసినది అదే.

సీత ఇంకా చెపుతుంది..

' హనుమా ! పుష్పమాలికలనూ ,
అన్ని రత్నములను అనురాగవతులైన స్త్రీలను
విశాలమైన పృథివినీ దుర్లభమైన ఐశ్వర్యమును త్యజించి
తల్లి తండ్రుల అనుమతితో రాముని అనుసరించినవాడు సుమిత్రానందనుడు.
లక్ష్మణుడు ధర్మాత్ముడు , అత్యుత్తమమైన సుఖము ను త్యజించి
అన్నగారైన కాకుత్‍స్థుని కి తోడునీడగా వనములో అనుసరించును.
సింహపు స్కంధమువంటి స్కంధముకల, మహాబాహువులు కల, మనస్వి, ప్రియదర్శనుడు.
నన్ను కన్నతల్లిలాగ, రాముని కన్నతండ్రిలాగా చూచుకొనును.
వీరుడు లక్ష్మణుని కి నన్ను అపహరింపబడడము తెలియదు.
వృద్ధులని సేవించు, వివేకముగల సమర్థుడైన అందరిమెప్పు పొందిన ఆ రాజకుమారుడు
నా మామగారితో సమానుడు'.

'రాముని యొక్క తమ్ముడు లక్ష్మణుడు.
ఎల్లప్పుడూ నాకు ప్రియమైన వాడు.
వీరుడు ఏపని అప్పగించినా నిర్వర్తించువాడు.
ఎవరిని చూచి రాముడు జరిగిన వృత్తాంతము తలచడో అతనిని
నాకొఱకై నా మాటలుగా కుశలము అడుగుము'.

'ఓ వానరోత్తమ సమర్థుడు రామునికి ప్రియుడు అయిన లక్ష్మణుడు
ఏవిధముగా నాదుఃఖమును అంతముచేయునో
అట్లు నీవు కార్యము సాధింప వలెను'.

అంతాచెప్పి భారము హనుమంతుడి మీదనే వదలుతుంది సీత.
సీతారాముల కలయికకి హనుమంతుడే కారకుడు.
హనుమంతుడు ఆచార్య స్వరూపములో జీవాత్మ పరమాత్మ కలయికకు కారకుడు.

' రాఘవుడు నీ సంరంభము వలనే నన్ను రక్షించు యత్నములో పడును.
నా నాధునికి మరల మరల చెప్పుము.
దశరథాత్మజ నేను ఒక మాసము జీవితము ధరించెదను.
మాసము గడిచి జీవించను.
నేను సత్యముగా చెప్పుచున్నాను.
ఓ వీరా పాపకర్ముడగు రావణుడు నన్ను బంధించినవాడు.
పాతాళమునుంచి ఇంద్రుని ఐశ్వర్యమును విష్ణువు రక్షించినట్లు
నీవు నన్ను రావణబంధమునుండి రక్షింపవలెను'.

అప్పుడు సీత తన వస్త్రములో కట్టబడిన
శుభకరము దివ్యము అయిన చూడామణిని తీసి
రాఘవునకు ఇవ్వమని హనుమంతునికి ఇచ్చెను.

ఆ కపిప్రవీరుడు మణిరత్నములు తీసుకొని
సీతాదేవికి ప్రదక్షిణము చేసి అభివందనములు చేసి ఆమె పక్కన నిలబడెను.
ఆతడు సీతా దర్శనముతో అత్యంత హర్షముపొంది
శరీరము ఇక్కడే ఉన్నా తన మనస్సుతో రాముని చేరెను.

తిరుగు ప్రయాణమునకు హనుమంతుడు సిద్ధపడెను.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ముప్పది ఎనిమిదవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||